7.6.26

ముక్కోటి దేవతల సాక్షిగా ప్రారంభమైన శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు brahmotsavams







కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.10 గంటల నుండి 8.45 గంటల మధ్య కర్కాటక లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.


శాస్త్రోక్తంగా పూర్వాంగ క్రతువులు


అంతకుముందు ఉదయం 4 గంటల నుండి ధ్వజప్రతిష్ఠ, రక్షాబంధనం, భేరీతాడనం, నవసంధి, బలిహారణం తదితర శాస్త్రోక్త క్రతువులు నిర్వహించారు. అనంతరం తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఉత్సవంలో రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.


ముక్కోటి దేవతలకు ఆహ్వానం


నాలుగు మాడవీధుల్లో జరిగిన ఈ మహోత్సవ ఊరేగింపు ద్వారా స్వామివారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించి, అష్టాదశ గణాలు, ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారనే విశ్వాసం భక్తుల్లో నెలకొని ఉంది.


నేటి రాత్రి పెద్దశేష వాహనంపై దివ్య విహారం


బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.


బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాలు


జూన్ 07 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

జూన్ 08 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం

జూన్ 09 – ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం

జూన్ 10 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం

జూన్ 11 – ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజ వాహనం

జూన్ 12 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

జూన్ 13 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

జూన్ 14 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం


జూన్ 09 శ్రీ స్వామివారి కల్యాణోత్సవం


బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన జూన్ 09న శ్రీ వేణుగోపాలస్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రూ.750 చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం ప్రసాదంగా అందజేయనున్నారు.


జూన్ 15 పుష్పయాగం


బ్రహ్మోత్సవాల అనంతరం జూన్ 15న మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4 గంటల వరకు శ్రీ స్వామివారికి పుష్పయాగం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించనున్నారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోపాలాచార్యులు, కంకణ బట్టార్ శ్రీ మురళీకృష్ణ స్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్. చెంగల్‌రాయులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments