15.6.26

పవిత్ర చక్రస్నానంతో శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలకు మంగళం chakrasnanam








కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నిర్వహించి పవిత్ర చక్రస్నాన మహోత్సవంతో భక్తి వైభవాల నడుమ ఘనంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన దివ్య కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, వేలాదిమంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.


పల్లకీ సేవతో ప్రారంభమైన ఆధ్యాత్మిక వేడుకలు


ఉదయం 6 గంటల నుండి 7.30 గంటల వరకు స్వామివారు, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్కంద పుష్కరిణి సమీపంలో శ్రీ రుక్మిణి, సత్యభామ సమే శ్రీ వేణుగోపాలస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది.


అభిషేకాల వైభవంభక్తులకు ఆధ్యాత్మికానందం


పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో నిర్వహించిన విశేష అభిషేకాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అనంతరం ఉదయం 9.45 గంటలకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు.


చక్రస్నాన మహిమ - లోకక్షేమానికి దివ్య సంకల్పం


తొమ్మిది రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవ సేవలు విజయవంతంగా పూర్తికావడంతో, జగత్‌క్షేమం, సకాల వర్షాలు, సుభిక్షం, భక్తుల ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం చక్రస్నానం నిర్వహించారు.


బ్రహ్మోత్సవాల్లో పాల్గొని చక్రస్నానాన్ని దర్శించిన భక్తులు పాప విముక్తులై, సర్వసంపదలతో వర్ధిల్లుతారని ఆధ్యాత్మిక విశ్వాసం.


ధ్వజావరోహణంతో ఉత్సవాలకు ముగింపు


సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించి, తొమ్మిది రోజుల పాటు సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారికంగా ముగింపు పలుకనున్నారు.

పాల్గొన్న ప్రముఖులు


కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చంగల్ రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments