నారాయణవనం
శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై కొలువుదీరిన స్వామివారు సకల సంపదల ప్రదాతగా, భక్తుల మనోరథాలను నెరవేర్చే కల్పతరువుగా అనుగ్రహించారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు.
వాహనం ముందుగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు నిర్వహిస్తూ గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. మార్గమధ్యంలో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
పురాణాల్లో కల్పవృక్షానికి విశిష్ట స్థానం ఉంది. దాని నీడను ఆశ్రయించిన వారికి ఆకలి, దప్పులు ఉండవని, పూర్వజన్మ స్మరణ కలుగుతుందని చెబుతారు. ఇతర వృక్షాలు తాము పండించిన ఫలాలను మాత్రమే అందిస్తే, కల్పవృక్షం కోరిన కోర్కెలన్నింటినీ ప్రసాదించే దైవస్వరూపంగా వర్ణించబడింది. ఈ సందేశాన్ని భక్తులకు చాటిచెప్పేలా స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరించారు.
ఇదిలా ఉండగా, రాత్రి 7 గంటల నుండి సర్వభూపాల వాహనసేవ వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments