16.6.26

పుష్పసుగంధాల మధ్య వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామివారి పుష్పయాగ మహోత్సవంPUSHPAYAGAM



కార్వేటినగరం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. పుష్పాల పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తులు స్వామివారి దివ్యానుగ్రహాన్ని ఆస్వాదించారు.


సందర్భంగా ఉదయం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి విశేషంగా పూజలు మర్పించారు.


అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరం, రోజా, తామర, కలువ, మొగలిరేకులు తదితర పది రకాల పుష్పాలు, మూడు రకా పవిత్ర పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. పుష్పాల అలంకారంతో శోభాయమానంగా దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులను దర్శించిన భక్తులు తన్మయత్వం చెందారు.


బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాలలో తెలిసీ తెలియక సంభవించిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని, మహోత్సవం ద్వారా సమస్త దోషాలు నివృత్తి చెంది లోకక్షేమం, భక్తుల శ్రేయస్సు కలుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు.

పుష్పయాగం అనంతరం స్వామి, అమ్మవార్లు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు మంగళదర్శనం ప్రసాదించనున్నారు.


కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments