29.9.26

తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుమల తరహాలో విద్యుత్ అలంకరణలు decoration




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తరహాలో ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.


డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.


భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, గతేడాది కంటే ఈ ఏడాది మరింత కాంతివంతంగా, సుందరంగా విద్యుత్ అలంకరణలు చేపట్టాలని సూచించారు. తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతిలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ వెలుగులతో అలంకరించి, అమ్మవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.


బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి


బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవో పరిశీలించి, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.


ప్రత్యేకంగా గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.


శాఖల సమన్వయంతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం


శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు.


అనంతరం అధికారులతో కలిసి ఉద్యానవనం, ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, గేట్ నెంబర్ 1, 2,3 ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. 


ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ గిరిధర, ఏవీఎస్వో శ్రీ శ్రీహరి రావు, డీఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, అదనపు హెల్త్ ఆఫీసర్ డా సునీల్ కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation

 




తిరుచానూరుకు చెందిన శ్రీరామినేని పూజిత అనే భక్తురాలు సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.


ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.


వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5.73 కోట్లు valmikipuram






అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి రామస్వామివారి ఆలయాన్ని మరింత ఆధ్యాత్మిక వైభవంతో అభివృద్ధి చేసేందుకు రూ.5.73 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణానికి టీటీడీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 5 వేల ఆలయాల నిర్మాణ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 1,200 ఆలయాల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.


స్థానిక ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామివారి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.


ప్రధాన అభివృద్ధి పనులు


పుష్కరిణి అభివృద్ధి – రూ.1.12 కోట్లు


కళ్యాణ వేదిక మండప నిర్మాణం – రూ.73 లక్షలు


దక్షిణ వైపు రాజగోపురం పునర్నిర్మాణం – రూ.52 లక్షలు


ఆలయ ప్రవేశ ఆర్చ్ నిర్మాణం – రూ.30 లక్షలు


కళ్యాణ మండపం రెండో అంతస్తు నిర్మాణం – రూ.1.80 కోట్లు


పార్వేట మండపం పునర్నిర్మాణం – రూ.1.26 కోట్లు


కాగా, ఆలయానికి చేరుకున్న టీటీడీ చైర్మన్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని వేదాశీర్వచనం పొందారు. ఆలయ విమాన ప్రాకారాన్ని ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీరాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, బోర్డు సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ శాంతారాం, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నరేష్ కుమార్, ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, సీఈ శ్రీ మనోహరం, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పి. వరలక్ష్మి, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, ఏఈవో శ్రీ గోపినాథ్, అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.