13.10.26

వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం BANGARU TIRUCHHI







తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.


ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.


ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, పాల్గొన్నారు.


భక్తుల సౌకర్యార్థం ‘వేంకటాద్రి’ యాప్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి apcm


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు టీటీడీ భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ‘వేంకటాద్రి’ మొబైల్ యాప్‌ను సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.


తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ ప్రాంతాలను సులభంగా గుర్తించడంతోపాటు అవసరమైన సౌకర్యాలను త్వరగా చేరుకునేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. ఇందులో 24 గంటల పాటు సేవలందించే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వాయిస్ కమాండ్ల ద్వారా తాగునీటి కేంద్రాలు, దర్శన ప్రవేశ ద్వారాలు తదితర ప్రదేశాలను భక్తులు సులభంగా గుర్తించవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉన్నా, పూర్తిగా అందుబాటులో లేకపోయినా ఉపయోగించుకునేలా ఆఫ్‌లైన్ నావిగేషన్ సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించారు.


ఈ యాప్‌లో 25 విభాగాలకు సంబంధించి 350కు పైగా ప్రదేశాల వివరాలను పొందుపరిచారు. వీటిలో తాగునీటి కేంద్రాలు, ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, పార్కింగ్ ప్రదేశాలు, మరుగుదొడ్లు, బస్ స్టాప్‌లు, దర్శన ప్రవేశ ద్వారాలు, లగేజీ కేంద్రాలు, ఉచిత పాదరక్షల డిపాజిట్ కేంద్రాలు, అన్న ప్రసాద కేంద్రాలు, ఆహార విక్రయ కేంద్రాలు, క్యాంటీన్లు, గది కేటాయింపు కౌంటర్లు, భక్తుల సహాయ కేంద్రాలు, టీటీడీ కార్యాలయాలు, ఉప విచారణ కార్యాలయాలు, కల్యాణకట్టలు, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు, ఆలయ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం తదితర సదుపాయాల వివరాలు ఉన్నాయి.


అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంప్రదించేందుకు అత్యవసర ఫోన్ నంబర్లు, పోలీస్ సేవలు, టీటీడీ హెల్ప్‌లైన్ వివరాలను యాప్‌లో పొందుపరిచారు. బస్సు మార్గాలు, సమయాలను కూడా తెలుసుకోవచ్చు. ‘మార్క్ మై స్పాట్’ సదుపాయం ద్వారా భక్తులు తాము పార్కింగ్ చేసిన ప్రదేశాన్ని లేదా ఇతర ముఖ్యమైన ప్రాంతాన్ని గుర్తుగా సేవ్ చేసుకుని, తిరిగి ఆ ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు.


‘వేంకటాద్రి’ యాప్‌ను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందించారు. ఇది యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్లు లేని భక్తులు కూడా ఈ సేవలను వినియోగించుకునేందుకు కియోస్క్‌ల ద్వారా యాప్ సేవలను అందించే ఏర్పాట్లను టీటీడీ చేపడుతోంది.


భక్తులకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం సులభంగా అందించడం ద్వారా తిరుమలలో వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడంతోపాటు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుందని టీటీడీ తెలిపింది.


ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, అమెరికాకు చెందిన ఎన్నారై దాత శ్రీ జేపీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ‘వేంకటాద్రి’ యాప్ పనితీరును వివరించారు. యాప్‌ కు రూపకల్పన చేసిన టీటీడీ కృషిని ముఖ్యమంత్రివర్యులు అభినందించారు.


తిరుపతి మహతిలో అలరించిన ‘గీతా మాహాత్మ్యం’ కూచిపూడి నృత్యరూపకం cultural programs



భగవద్గీత సందేశానికి నృత్యరూపం.. భక్తి కీర్తనలతో పుష్కరిణి పరిసరాల్లో ఆధ్యాత్మిక పరిమళం

 

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతిలో సోమవారం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, పురప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. భగవద్గీత తత్త్వాన్ని చాటిచెప్పిన నృత్యరూపకం, మధురమైన భక్తి కీర్తనలతో పలు వేదికలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

 

మహతిలో ‘గీతా మాహాత్మ్యం’

 

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో హైదరాబాద్‌కు చెందిన కుమారి ఎం. గౌరవి రెడ్డి బృందం ప్రదర్శించిన ‘గీతా మాహాత్మ్యం’ కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

 

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ‘భగవద్గీత భగవద్గీత’, ‘అర్జున విషాదయోగం’ తదితర గీతాలను నృత్యరూపంలో ప్రదర్శించారు. చిన్నారులు అభినయించిన దశావతార నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భగవద్గీతలోని ఆధ్యాత్మిక సందేశాన్ని నృత్యాభినయం ద్వారా ఆవిష్కరించిన కళాకారులు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

 

శ్రీ కోదండరామస్వామివారి పుష్కరిణి వద్ద భక్తి సంగీతం

 

శ్రీ కోదండరామస్వామివారి పుష్కరిణి వద్ద హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి వి. జానకి బృందం ఆలపించిన భక్తి కీర్తనలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తాయి.

 

‘ఓం నారాయణ జై జై’, ‘రామ రామ రామ రామ’, ‘తిరువీధుల మెరిసేను దేవదేవుడు’, ‘భాగ్యదా లక్ష్మీ బారమ్మ’, ‘శ్రీరామ నామం మరువం మరువం’, ‘మా తల్లి అలమేలుమంగ’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘తంబూరి మీటిదవా’, ‘గోవింద హరి గోవింద’ తదితర భక్తి గీతాలను మధురంగా ఆలపించారు.

 

అన్నమాచార్య, త్యాగరాజ తదితర వాగ్గేయకారుల కీర్తనలతో పాటు శ్రీరామ, శ్రీకృష్ణ, గోవింద నామస్మరణతో పుష్కరిణి పరిసరాలు భక్తిమయంగా మారాయి. చివరగా ‘రామచంద్రాయ జనక రాజజ’ కీర్తనతో కార్యక్రమాన్ని ముగించారు.

 

మధురమైన సంగీతం, భక్తిపూర్వకమైన గానంతో సాగిన ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి.