దేశం
, రాష్ట్రం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధిలో ముందుండేలా స్వామివారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీవారి సేవలోప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మన ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రీవారి దర్శనం
ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
2027 టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ
ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొని స్వామివారి వైభవాన్ని దర్శించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మానవ వనరులు, ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ పాలకమండలి సభ్యులు,
జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.