రాష్ట్ర
ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు బుధవారం తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించే లక్ష్యంతో టీటీడీ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కార్యక్రమాలు ఉన్నాయి.తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకునేలా ఈ కేంద్రాన్ని రూపొందించారు. తిరుమల చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ఏఐ, వర్చువల్ రియాలిటీ, ఇంటరాక్టివ్ డిస్‌ప్లేల ద్వారా భక్తులకు అందించడంతో పాటు గైడెడ్ మెడిటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ధ్యాన కార్యక్రమాలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, 2లో వేచి ఉండే భక్తులకు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇదే కేంద్రాన్ని టీటీడీ ఉద్యోగుల శిక్షణకు కూడా వినియోగించనున్నారు.
‘దుర్లభ దర్శన్’ – వీఆర్‌లో శ్రీవారి విశిష్ట సేవల అనుభూతి
హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘దుర్లభ దర్శన్’ వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అత్యాధునిక వీఆర్ హెడ్‌సెట్ ద్వారా 13 నిమిషాల 3D, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ చిత్రాన్ని భక్తులు వీక్షించవచ్చు. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవంతో పాటు సాధారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు మాత్రమే వీక్షించే అవకాశం లభించే సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన, అభిషేకం తదితర విశిష్ట సేవలను వీఆర్ సాంకేతికత ద్వారా దగ్గరగా వీక్షించిన అనుభూతిని కల్పిస్తారు.
32 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
తిరుమలలో భక్తుల ఉచిత రవాణా సౌకర్యాలను మరింత విస్తరించేందుకు విరాళంగా అందిన 32 ఎలక్ట్రిక్ బస్సులను ‘శ్రీవారి ధర్మరథాలు’గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 25 బస్సులు, భారత్ బయోటెక్ ఫౌండేషన్ 7 బస్సులను అందించాయి. కొత్త బస్సులతో తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య 18 నుంచి 50కి, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 14 నుంచి 44కు పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు 300 ట్రిప్పులు నిర్వహిస్తుండగా, కొత్త బస్సులతో మూడు మార్గాల్లో రోజుకు 810 ట్రిప్పులు నిర్వహించనున్నారు. ప్రధాన మార్గాల్లో ప్రతి మూడు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులోకి రావడంతో భక్తులకు రవాణా మరింత సులభతరం కానుంది.
శ్రీ వేంకటేశ్వర మ్యూజియం - ఆధునిక సాంకేతికతతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 1998లో ప్రారంభమైన ఈ మ్యూజియాన్ని టీసీఎస్ సంస్థ సహకారంతో నూతన గ్యాలరీలు, ఇమ్మర్సివ్ టెక్నాలజీ, ఆధునిక సౌకర్యాలతో పూర్తిగా పునరుద్ధరించారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో 14 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి, 8,000కు పైగా అరుదైన ప్రదర్శన వస్తువులను అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆభరణాలు, ఆలయ కళా సంపద, శిల్పాలు, అన్నమయ్య రాగి రేకులు, అరుదైన నాణేలు, ఆలయ నిర్మాణ శాస్త్రం, భక్తులు–దాతలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి, త్రిమూర్తులు, వేదాలు తదితర అంశాలను వివిధ గ్యాలరీల్లో ప్రదర్శిస్తున్నారు. హోలోగ్రాఫిక్ డిస్‌ప్లేలు, 360 డిగ్రీల సౌండ్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లేలు, డిజిటల్ ఆర్కైవ్స్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ సీఈఓ&ఎండీ శ్రీ కె. కృతివాసన్, ప్రెసిడెంట్ శ్రీ వి. రాజన్న, ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీ ఎ. భీమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు రూ.2 లక్షల ఉచిత జీవిత బీమా - ఎల్‌ఐసీతో టీటీడీ వినూత్న పథకం
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమలలో బస సమయంలో రూ.2 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా టీటీడీనే ప్రీమియం భరిస్తుంది. ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా గ్రూప్ టర్మ్ ఈజ్ ప్లాన్ ద్వారా భక్తులు, శ్రీవారి సేవకులకు నాలుగు రోజుల వరకు బీమా రక్షణ ఉంటుంది. క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్, పేపర్‌లెస్ విధానంలో నిర్వహిస్తారు. ఇందుకోసం టీటీడీ ఎల్‌ఐసీ వద్ద రూ.2.12 కోట్ల అడ్వాన్స్ డిపాజిట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ సీఈఓ&ఎండీ శ్రీ ఆర్. దొరైస్వామి, పెన్షన్&గ్రూప్ స్కీమ్ ఎండీ శ్రీ పునీత్ కుమార్, జోనల్ మేనేజర్ శ్రీ ఎస్. శరవణ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నందకం యాప్ – వసతి గదుల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం
తిరుమలలోని భక్తుల వసతి గృహాల్లో విద్యుత్, ప్లంబింగ్, హౌస్ కీపింగ్, కార్పెంట్రీ తదితర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు రూపొందించిన ‘నందకం’ డిఫెక్ట్ మేనేజ్‌మెంట్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన 3Five8 Technologies Pvt. Ltd. (ADDA App) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. తిరుమలలో ఆరు ప్యాకేజీల పరిధిలోని 7,043 గదులను ఈ యాప్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆగస్టు 8న ప్రారంభించిన ట్రయల్ రన్‌లో 2,031 సమస్యలను నమోదు చేయగా, 2,028 సమస్యలను పరిష్కరించారు. వీటిలో 98.2 శాతం సమస్యలను నిర్దేశిత సమయంలోనే పరిష్కరించడం విశేషం. సమస్య నిర్ణీత సమయంలో పరిష్కారం కాకపోతే సంబంధిత ఉన్నతాధికారికి ఆటోమేటిక్‌గా ఎస్కలేట్ అయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రెండో దశలో భక్తుల ఫిర్యాదుల నిర్వహణను కూడా ఇందులో అనుసంధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్&సీఈఓ శ్రీమతి సంగీతా బెనర్జీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రివర్యులతో రాష్ట్ర మంత్రులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్య ప్రసాద్ తదితరులు ఉన్నారు.
టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, పలువురు పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఎ. శరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు వివిధ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.