6.9.25

శ్రీవారి సేవకుల గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్‌పై ఈఓ సమీక్ష ttd eo review





టిటిడిలోని పలు విభాగాలలో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు సంబంధించి గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్ పై టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఏపీ ప్లానింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వేంకటేశ్వర రావు, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంలతో, మరియు వర్చువల్ గా ఐఐఎం అహ్మదాబాద్ కు చెందిన ప్రొఫెసర్లు విశ్వనాథ్, రామమోహన్ లు, టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిలతో శుక్రవారం టిటిడి ఈవో సమీక్షించారు.


ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, శ్రీవారి సేవా ప్రమాణాలను మరింత పెంపొందించాలనే ఉన్నతమైన సంకల్పంతో గత కొద్ది కాలంగా పలు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సంస్కరణలలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను సెప్టెంబర్ 3న ప్రారంభించామన్నారు.

శ్రీవారి సేవకుల ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేందుకు మరింత పటిష్ట ప్రణాళికలు, బోధన పాఠ్యాంశాలను రూపొందించాలని సూచించారు. శిక్షణ పొందిన ట్రైనర్లు, సూపర్వైజర్లు సేవకులకు శిక్షణ ఇస్తారని, దీనివల్ల శ్రీవారి సేవలో మరింత నాణ్యత పెరుగుతుందన్నారు. మొదటి విడత శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు  కొనసాగుతుందన్నారు. ఉదయం విధానపరమైన అంశాలపై శిక్షణ , మధ్యాహ్నం వివిధ సేవా కేంద్రాలలో ఫీల్డ్ విజిట్‌లకు వెళ్లి పరిశీలించేలా రూపొందిచాలన్నారు.

అనంతరం గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్‌పై ప్లానింగ్ విభాగానికి చెందిన నలుగురు నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ శిక్షణలో 8 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేవ యొక్క ఆధ్యాత్మిక మూలాలు, శ్రీవారి సేవ పరిణామ క్రమం, వివిధ సందర్భాలలో సేవ ప్రాముఖ్యత, ప్రత్యేక రోజులలో సేవ నిర్వహణ, పటిష్ట సేవ అందించేందుకు నైపుణ్యాలు, స్పూర్తిధాయకమైన నాయకత్వం, సులభ పద్దతిలో అందరికి అర్థమయ్యేలా, ఆదర్శ సేవకుడి లక్షణాలు, పలు బాషలలో ప్రాథమిక నైపుణ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డా. టి. రవి, డీఎఫ్‌వో & జిఎం (ఐటీ ఇన్‌చార్జ్) శ్రీ ఫణికుమార్ నాయుడు, ఆల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రాం ఆఫీసర్ & శ్వేత  డైరెక్టర్ ఇన్‌చార్జ్ శ్రీ రాజగోపాల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments