టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఉద్దేశించి భక్తుల నుండి విలువైన అభిప్రాయాన్ని సేకరించేందుకు వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేలను టీటీడీ ప్రారంభించింది.
రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీటీడీ ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరిస్తోంది.
ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ సర్వే...
ఈ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజ్ కౌంటర్ మరియు ప్రైవేట్ హోటళ్ల ధరలపై మొత్తం 17 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.
వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం...
తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే (వాట్సాప్ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
అనంతరం, అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకుని సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు గా రేటింగ్ చేయాల్సి ఉంటుంది.
భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చు.
శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ
తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు. ఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వే ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది.
డయల్ యువర్ ఈవో ద్వారా....
ప్రతినెలా మొదటి శుక్రవారం టీటీడీ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇందుకు భక్తులు 0877-2263261 కు కాల్ చేసి తమ అభిప్రాయాలను టీటీడీ ఈవోకు నేరుగా తెలుపవచ్చు.
ఈ-మెయిల్ ద్వారా అభిప్రాయాల సేకరణ...
టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా కూడా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
వివిధ మాధ్యమాల ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అధిక సంఖ్యలో భక్తులకు ఉపయోగపడేలా సేవలను మరింత నాణ్యంగా అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.

No comments :
Write comments