శ్రీ
పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి ఛైర్మెన్ డే స్కాలర్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఎంతో ఆశతో చదివిస్తున్నారని, కనుక పట్టుదలతో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులకు సూచించారు. ఇంటర్మీడియట్ విద్య బంగారు భవిష్యత్తుకు పునాది వేసే సదవకాశమన్నారు. ఈ దశలో మీరు వేసే ప్రతి ప్రయత్నం, తీసుకునే ప్రతి నిర్ణయం జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా నిరాశపడకుండా కష్టంతో టిటిడి ఛైర్మెన్ స్థాయికి వచ్చానన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, అవి సాధించే వరకు ప్రయత్నం ఆపరాదని విద్యార్థినులకు సూచించారు.
ఇంతటి పోటీ ప్రపంచంలో పద్మావతి జూనియర్ కళాశాల గత సంవత్సరం పరీక్షల ఫలితాల్లో 97 శాతం రాణించడం అభినందించదగ్గ విషయమని, ఈసారి 100శాతం ఫలితాలు సాధించి టిటిడి సంస్థకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. డే స్కాలర్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డేస్కాలర్స్ విద్యార్థినిలకు ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రారంభించి వారితోపాటు కలిసి భోజనం చేశారు. శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో డే స్కాలర్స్ కు కల్పించిన సదుపాయం ద్వారా 436 మంది విద్యార్థినులకు లబ్ది చేకూరుతుంది.
అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. భువనేశ్వరి కళాశాల సమగ్ర నివేదికను నివేదించారు. గత సంవత్సర పరీక్షల ఫలితాలలో సమిష్టి కృషితో 97 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. కళాశాల వార్షికోత్సవ ప్రారంభంలో విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జి. భానుప్రకాష్ రెడ్డి, శ్రీ ఎస్. శాంతారామ్, శ్రీ నరేష్ కుమార్, డీఈవో డా. టి. వేంకట సునీలు, కళాశాల అధ్యాపకులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు
No comments :
Write comments