పుంగనూరు
శ్రీ కల్యాణ వేంకట రమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 09.00 గం.లకు స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5 గంటలకు మేష లగ్నంలో స్వామివారు రథారోహణం చేశారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా రథోత్సవం జరిగింది.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.
అనంతరం మధ్యాహ్నం 12.45 గం.లకు మిధున లగ్నంలో చక్రస్నానం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 06.00 గం.లకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో శ్రీ కల్యాణ వేంకట రమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments