తిరుపతి
శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
సింహ రూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీకోదండరాముడు విహరించి భక్తులను కనువిందు చేయనున్నారు.
వాహనసేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్ బాబు, శ్రీ హరి కృష్ణ, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments