టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 01, 2026 వరకు స్వీకరిస్తారు.
తిరుపతి, భీమవరం, వరంగల్ ప్రాంతాల్లోని ఈ విద్యాసంస్థల్లో చేరదలచిన బధిర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రతి ఏడాది 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పించబడతాయి. ఇతర తరగతుల్లో ఖాళీల మేరకు ప్రవేశాలు ఉంటాయి.
తిరుపతిలో 1వ తరగతి చేరాలనుకునే అభ్యర్థులకు, 2వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ఖాళీలను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. సదరు తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మెదటి సంవత్సరం ప్రవేశాలకు తిరుపతి కళాశాల లేదా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులను తిరుపతి ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల నుండి నేరుగా పొందవచ్చు లేదా www.tirumala.org
వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఇంఛార్జి ప్రిన్సిపాల్, ఎస్వీడిఎఫ్, అలిపిరి, తిరుపతి – 517501 చిరునామాకు పంపాలి.
ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల నేపథ్యం
తిరుపతి అలిపిరి సమీపంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ బధిరోన్నత పాఠశాల మరియు ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల బధిర విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
జూలై 25, 1974 సంవత్సరంలో 17 మంది బధిర విద్యార్థులతో అప్పట్లో టిటిడి ఛైర్మెన్ శ్రీ సి. అన్నారావు గారు ప్రారంభించారు. దశలవారీగా తరగతులను పెంచుకుంటూ ప్రస్తుతం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు శ్రీ వేంకటేశ్వర బధిరోన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ లో హెచ్.ఈ.సీ, సీఈసీ గ్రూప్ లతో శ్రీ వేంకటేశ్వర బధిరుల జూనియర్ కళాశాలను (2008 నుండి) టిటిడి నిర్వహిస్తోంది. విద్యతో పాటు డ్రాయింగ్, టైలరింగ్, బుక్ బైండింగ్ , యోగ లాంటి నైపుణ్య వృత్తులలో శిక్షణ ఇస్తోంది.
ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ ఎస్వీ బధిరోన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 231 మంది బధిర విద్యార్థిని, విద్యార్థులు, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో 162 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 1985 ఏడాది నుండి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో 1987 ఏడాది నుండి బధిర విద్యార్థుల కోసం పాఠశాలలను ప్రారంభించారు. ప్రస్తుతం భీమవరంలో 80 మంది, వరంగల్ లో 166 మంది బధిర విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. టిటిడి ప్రతి ఏడాది బధిర విద్యార్థిని విద్యార్థుల పురోగతి కోసం సుమారు రూ.3.50 కోట్లు పైచిలుకు ఖర్చు చేస్తోంది. ఏడాదికోసారి తిరుపతి, తిరుమల ఆలయాలకు తీసుకెళ్తారు. టిటిడి బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల కళాశాల యందు విద్యను అభ్యసించిన విద్యార్థిని, విద్యార్థులు టిటిడిలో పలు విభాగాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు.
ఈ సంస్థల ద్వారా బధిర విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, వైద్య సంరక్షణ, సంకేత భాష ఆధారిత బోధన, నైతిక విలువలు మరియు వృత్తి నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా పద్ధతులు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థులను స్వావలంబన దిశగా తీర్చిదిద్దుతూ సమాజంలో సమాన అవకాశాలు కల్పించడమే ఈ సంస్థల లక్ష్యం. బధిర విద్యార్థులకు ఒక ఆశాకిరణంగా నిలుస్తున్న ఈ విద్యాసంస్థలు టిటిడి సేవా సంకల్పానికి స్ఫష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి.
No comments :
Write comments