శ్రీ సీతారాముల కళ్యాణానికి మార్చి 30 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - ఏర్పాట్లపై సమగ్ర తనిఖీలు నిర్వహించిన జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం sri rama kalyanam
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మార్చి 30 నాటికి పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
సోమవారం జేఈఓ అధికారులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలు, కళ్యాణ వేదిక వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, యాగశాల, పోటు, సాంస్కృతిక వేదికలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడం, తాగునీటి సదుపాయాలను విస్తరించడం, భక్తులకు చల్లని వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భక్తులను ఆకట్టుకునేలా లేజర్ లైటింగ్, ఎల్ఈడి తోరణాలు ఏర్పాటు చేసి ఉత్సవాలకు ఆధ్యాత్మిక శోభను పెంచాలని, ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణలు చేపట్టి దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు.
అనంతరం అన్నప్రసాద భవనాన్ని పరిశీలించిన జేఈఓ, భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రసాద పంపిణీ కేంద్రాలు, క్యూలైన్లు, గ్యాలరీలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ అవసరమైనన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిబింబించేలా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కళ్యాణ వేదికపై తెలుగుదనం ఉట్టిపడేలా పుష్పాలంకరణలు చేయాలన్నారు.
ఆలయం, క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, గ్యాలరీలలో భక్తులకు సేవలు అందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని సిపిఆర్ఓ డా. టి. రవికి సూచించారు. శ్రీరామనవమి పర్వదినాన ప్రతి భక్తునికి వడపప్పు, పానకం పంపిణీ చేయాలని అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రిని ఆదేశించారు.
తరువాత ఒంటిమిట్టలోని టీటీడీ విశ్రాంతి భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఇ శ్రీ మనోహరం, ఎస్.ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సీఎంవో డా. కుసుమకుమారి, వీజీఓ శ్రీ గిరిధర్, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డా. సునీల్ తదితరులు పాల్గొన్నారు.


%20INSPECTIONS%2009.jpg)
%20INSPECTIONS%2010.jpg)
%20INSPECTIONS%2011.jpg)
%20INSPECTIONS%2004.jpg)
%20INSPECTIONS%2008.jpg)








