29.6.26

సర్వభూపాల వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరస్వామి దివ్యదర్శనం sarvabhoopala vahanam







అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు సర్వభూపాల వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.


రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో గోవింద నామస్మరణల మధ్య స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని దివ్యానుగ్రహాన్ని పొందారు.


అంతకుముందు ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.


వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి  కళ్యాణోత్సవం


సాయంత్రం 4 గంటలకు శ్రీవారిని కళ్యాణ మండపానికి వేంచేపు చేయగా, 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆర్జిత కళ్యాణోత్సవం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.


సోమవారం ఉదయం మోహినీ అవతారంరాత్రి గరుడసేవ


జూన్ 29న సోమవారం ఉదయం 8 గంటలకు పల్లకిపై మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. గరుడసేవకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


ఈ వాహనసేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments