తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
సుప్రభాతం నుంచి వైదిక కార్యక్రమాలు
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.
స్వామివారికి స్నపనతిరుమంజనం
సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం కన్నులపండువగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీటితో స్వామివారికి అభిషేకం చేశారు.
వైభవంగా పవిత్రాల సమర్పణ
యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అలాగే విష్వక్సేనుడు, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడాళ్వార్, హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణుల ఊరేగింపు
సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 10న పవిత్రోత్సవాల ముగింపు
ఆగస్టు 10న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్ కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




No comments :
Write comments