తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఉదయం జరిగిన మోహినీ అవతార సేవలో భారతీయ కళా వైభవం వెల్లివిరిసింది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కళాబృందాలతోపాటు టీటీడీకి చెందిన వివిధ కళా ప్రాజెక్టులు, సంస్థల కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
మొత్తం 18 కళాబృందాలకు చెందిన 502 మంది కళాకారులు 18 కళారూపాలను ప్రదర్శించారు. భరతనాట్యం, కూచిపూడి, సత్రియ, ఒడిస్సీ, భాంగ్రా, కోలాటం, పెరిణి శివతాండవం, మయూర నృత్యం, డమరుక ధ్వని విన్యాసం, అన్నమయ్య జానపదాలు తదితర ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
మహారాష్ట్రకు చెందిన కథేకర్ బృందం గూమర్, పెద్దతాళాలతో జెంజ్ నృత్యం, మధ్యప్రదేశ్‌కు చెందిన మయాంక్ తివారి బృందం బడాయి నృత్యం, కేరళకు చెందిన కె. రచన బృందం తిరువట్టన్ రూపకం, అస్సాంకు చెందిన సబిత సైకియా బృందం సత్రియ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు మోహినీ అవతార సన్నివేశం, భరతనాట్యం, పెరిణి శివతాండవం తదితర ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టులకు చెందిన కళాబృందాలు కూడా భక్తిరసభరిత కళా ప్రదర్శనలు అందించాయి.
నాలుగు ఉత్తమ కళాబృందాలకు ఈవో సన్మానం
వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శాలువాతో సత్కరించారు.
• దాస సాహిత్య ప్రాజెక్టు: శ్రీ ఎం. గౌరవి రెడ్డి బృందం – సప్తగిరి వైభవం, హైదరాబాద్, తెలంగాణ – 28 మంది.
• హిందూ ధర్మ ప్రచార పరిషత్తు: శ్రీ కథేకర్ బృందం – పండర్‌పూర్ వార్కరీ & గర్భ నృత్యం, మహారాష్ట్ర – 60 మంది.
• శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల: శ్రీ ఎన్. శివకుమార్ బృందం – భరతనాట్యం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – 23 మంది.
• అన్నమాచార్య ప్రాజెక్టు: శ్రీ హర్దీప్ సింగ్ బృందం – భాంగ్రా, పంజాబ్ – 15 మంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్న ఈ కళా ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతోపాటు భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవాన్ని పరిచయం చేస్తున్నాయి.








No comments :
Write comments