కార్వేటి
నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైదిక మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం జరిగింది.
సాయంత్రం 6 గంటల నుంచి మేదినీ పూజ, మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
రేపు పవిత్రాల సమర్పణ – పూర్ణాహుతితో ముగింపు
సెప్టెంబరు 8న ఉదయం మూలవర్లకు తిరుమంజనం నిర్వహించి పవిత్రాలను సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి ఉత్సవం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలను ముగిస్తారు.
ఆలయ పవిత్రత పరిరక్షణే పవిత్రోత్సవాల పరమార్థం
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయితే భక్తులు, సిబ్బంది తెలియక ఆలయ ప్రవేశం చేయడం వల్ల అనుకోకుండా కొన్ని దోషాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇటువంటి దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా శాస్త్రోక్తంగా పరిహార కార్యక్రమాలు నిర్వహించడమే పవిత్రోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం.
ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించి ఆలయ పవిత్రతను పునరుద్ధరిస్తారు. స్వామివారి అనుగ్రహంతో పవిత్రోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వీరాస్వామి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments