తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే గరుడసేవకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.
గరుడసేవ విధుల్లో పాల్గొనే టీటీడీ ఉద్యోగులు, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన సిబ్బంది, శ్రీవారి సేవకులతో శుక్రవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకునేందుకు గరుడసేవకు తరలివచ్చే ప్రతి భక్తుడిని గౌరవిస్తూ, సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది గరుడసేవ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు, టీటీడీ విభాగాలు పరస్పర సమన్వయంతో చైన్‌లింక్‌లా పనిచేసి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా భక్తులకు సేవలందించాలన్నారు.
టైం మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, సమన్వయం, సేవాభావం ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వర్తించాలని తెలిపారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యసేవలు తదితర సౌకర్యాలను సకాలంలో అందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాహనసేవ ముగిసిన అనంతరం కూడా ఉద్యోగులు, శ్రీవారి సేవకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి, భక్తులు సురక్షితంగా వెళ్లే వరకు అవసరమైన సేవలు అందించాలని తెలిపారు. శ్రీవారి సేవకులు నిస్వార్థంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యం : జేఈవో డా. ఎ. శరత్
టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, శాఖల వారీగా అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా, విధేయతతో వ్యవహరిస్తూ సౌకర్యవంతమైన సేవలు అందించడమే పరమావధిగా ఉండాలని కోరారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా సేవలు : సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ
టీటీడీ సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ, గరుడసేవ రోజున భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అందుకు అనుగుణంగా సేవలను పటిష్టం చేయాలని సూచించారు. టీటీడీ విజిలెన్స్, పోలీసు విభాగాలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అనంతపురం రేంజ్ ఐజీ సర్వశ్రీ శిమోషీ బాజ్‌పేయి, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
No comments :
Write comments