22.9.26

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం snapana tirumanjanam







తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి సోమవారం స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు తదితరాలతో రూపొందించిన విశేష మాలల మధ్య స్వామి, అమ్మవార్లు దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.


తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకస్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.


పంచామృతాలతో పవిత్ర అభిషేకం


సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు.


వేద ఘోషతో మార్మోగిన రంగనాయకుల మండపం


స్నపన తిరుమంజనం సందర్భంగా టీటీడీ వేద పారాయణదారులు ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను భక్తిభావంతో పారాయణం చేశారు.


అభిషేకానంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు.

No comments :
Write comments