12.9.26

భక్తి, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి బ్రహ్మోత్సవ డెప్యూటేషన్ సిబ్బందికి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సూచన ttd addl eo




తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది భక్తి, నిబద్ధతతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు.

తిరుమల ఆస్థాన మండపంలో శుక్రవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధుల కోసం వచ్చిన డిప్యూటేషన్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున, గత అనుభవాన్ని ఉపయోగించుకుని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రతి ఉద్యోగి తనకు కేటాయించిన విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ నిర్దేశించిన దుస్తులు ధరించాలని సూచించారు.

భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సీనియర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో సూచించారు. భక్తుల పట్ల మర్యాదగా, సేవాభావంతో వ్యవహరించి శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కోరారు.

సమన్వయంతో పనిచేయాలి : సీవీఎస్వో

టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల  సందర్భంగా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను క్రమశిక్షణతో, సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు చరిత్రలో మైలురాయిగా నిలిచేలా అధికారులు, సిబ్బంది సమష్టి కృషి చేయాలని ఆయన కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్‌చార్జ్‌ సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈ శ్రీ వేణుగోపాల్, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ రాజేంద్ర, శ్రీ సోమన్నారాయణ, క్యాంటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, వీజీఓ శ్రీ సురేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments