13.10.26

రూ.3,222 కోట్లతో దివ్యక్షేత్రంగా తిరుపతి అభివృద్ధి devine destination








తిరుపతి–తిరుమల ప్రాంతాన్ని ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల సమన్వయంతో దివ్యక్షేత్రంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సచివాలయం సిఎంవో నుంచి వర్చువల్‌గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ‘వెంకటాద్రి’ యాప్‌ను ఆవిష్కరించారు.


రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌


తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అలిపిరి సమీపంలోని ఎస్వీ జూపార్క్‌ రహదారి వద్ద రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్‌, వైద్య సేవలు, డిజిటల్ సమాచార కేంద్రాలు తదితర సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి.


రూ.1,332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో పది అంతస్తుల చొప్పున మొత్తం 2,700 గదులను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజుకు సుమారు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. రూ.160 కోట్లతో నిర్మించే అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు. రూ.311 కోట్లతో 4,500 వాహనాలకు సరిపడే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని, రూ.90 కోట్లతో 30 బస్‌ బేలతో కూడిన సమీకృత రవాణా టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నారు.


భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు శ్రీవారి చరిత్ర, వైభవం, సంప్రదాయాలను పరిచయం చేసే పిలిగ్రిమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌, ఆధునిక భద్రతా వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.


టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి రూ.230 కోట్లు


శ్రీవారి సేవలో నిరంతరం నిమగ్నమయ్యే టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా పాదిరేడు అరణ్యం వద్ద 418 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న గృహ స్థలాల లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.230 కోట్లు వెచ్చించనున్నారు. తొలి, రెండో దశల్లో మొత్తం 5,192 మంది ఉద్యోగులకు కేటాయించిన గృహ స్థలాల్లో రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి కేంద్రం, విద్యుత్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు.


ఇందులో టీటీడీ రూ.150 కోట్లు, ఉద్యోగులు రూ.80 కోట్లు సమకూర్చనున్నారు. ఈ టౌన్‌షిప్‌ను పర్యావరణహిత నెట్‌జీరో ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉంటే వారు మరింత అంకితభావంతో భక్తులకు సేవలందించగలరని పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చినందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులు


తిరుపతి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మించనున్నారు. మొత్తం సుమారు 20 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పనుల్లో తుడా రూ.127 కోట్లతో 16.50 కిలోమీటర్లు, టీటీడీ రూ.115 కోట్లతో 3.60 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ రహదారులు జాతీయ రహదారులు 140, 71 మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించనున్నాయి.


భక్తుల సేవలకు ‘వెంకటాద్రి’ యాప్‌


భక్తులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందించేందుకు రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. శ్రీవారి ఆలయాలు, అన్నదానం, విద్యాదానం, ప్రాణదానం, వృక్షగోవిందం, శ్రీవారి సేవ, గోశాల తదితర సేవా కార్యక్రమాలను అనుసంధానిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించేలా యాప్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.


తిరుపతిలోని చెరువులను అనుసంధానించి సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు, ఔషధ మొక్కల ప్రాంతాలను ఆధ్యాత్మిక, ప్రకృతి అనుభూతిని అందించే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేస్తూ శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా చాటిచెప్పాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఆధ్యాత్మికతతో పాటు ఉపాధి, పర్యాటకానికి ప్రాధాన్యం


తిరుపతిని వివాహ వేడుకలు, అంతర్జాతీయ సదస్సులు, క్రీడలకు అనువైన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ హాల్‌ ఏర్పాటు, క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ, ఏసీఏ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.


దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి ఆధ్యాత్మికతతోపాటు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సౌకర్యాల విషయంలో ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యాలు, టీటీడీ ఉద్యోగుల సంక్షేమం, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమన్వయం చేస్తూ తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ శ్రీ బీఆర్‌ నాయుడు, మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్, శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, శ్రీ నారాయణ, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్‌ వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్‌, శ్రీ గోపినాథ్‌, పాలకమండలి సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ జి. భానుప్రకాష్ రెడ్డి, శ్రీ శాంతారాం, తుడా ఛైర్మన్ మరియు టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, తుడా అధికారులు, టిటిడి అధికారులు, టిటిడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.


No comments :
Write comments