21.10.26

వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. భక్తులకు విస్తృత ఏర్పాట్లుchakrasnanam




తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించనున్న పవిత్ర చక్రస్నానానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి శ్రీవారి పుష్కరిణిని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.

ఒకేసారి 9,450 మంది స్నానాలకు ఏర్పాట్లు

పుష్కరిణిలో ఒకేసారి సుమారు 9,450 మంది భక్తులు స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకల కోసం 7 ప్రవేశ ద్వారాలు, 10 నిష్క్రమణ ద్వారాలు కలిపి మొత్తం 17 గేట్లు ఏర్పాటు చేశారు. బారికేడ్ల ద్వారా రద్దీని క్రమబద్ధీకరిస్తూ, భక్తులు సురక్షితంగా స్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకున్నారు.

పటిష్ట భద్రత.. నిరంతర వైద్య సేవలు

టీటీడీ విజిలెన్స్, పోలీసులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కరిణిలో ఈతగాళ్లు, బోటును అందుబాటులో ఉంచారు. అశ్విని ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య బృందాలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచి అత్యవసర వైద్య సేవలు అందించనున్నారు. పుష్కరిణి నీటి నాణ్యతను పరీక్షించి, నీరు కలుషితం కాలేదని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.

అన్నప్రసాదం.. ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా వీక్షణం

చక్రస్నానానికి విచ్చేసే భక్తులకు, విధుల్లో పాల్గొనే సిబ్బందికి అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. భక్తులు చక్రస్నానాన్ని వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

భక్తులు సంయమనం పాటించాలి

చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని, భక్తులు తొందరపడకుండా అధికారుల సూచనల మేరకు క్రమపద్ధతిలో పుష్కరిణిలో స్నానాలు ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిర్దేశించిన మార్గాలు, గేట్ల ద్వారానే రాకపోకలు సాగిస్తూ సిబ్బందికి సహకరించాలని కోరింది. క్రమశిక్షణతో, సురక్షితంగా పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments