తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధరించి, సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా వీణాధారిగా అలంకృతులైన స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
హంస వాహనం – జ్ఞానానికి, వివేకానికి ప్రతీక
హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా నిలుస్తుంది. పాలను, నీటిని వేరు చేయగలదనే సంప్రదాయ భావన వివేకశక్తిని సూచిస్తుంది. ఇది ఆత్మానాత్మ వివేచనకు సంకేతం. పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహనీయులను ఉపనిషత్తులు ‘పరమహంసలు’గా అభివర్ణిస్తాయి. భక్తుల్లో అహంభావాన్ని తొలగించి, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మపద ప్రాప్తికి అనుగ్రహించే దివ్యవాహనంగా హంస వాహనాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయం కీర్తిస్తుంది.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments