తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గురువారం తిరుపతిలోని మహతిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హైదరాబాద్కు చెందిన శ్రీమతి ఎల్. ధనలక్ష్మి, లలిత ఫౌండేషన్ బృందం కళాకారులు సంప్రదాయ కూచిపూడి నృత్యరీతిలో వివిధ నృత్యాంశాలను ప్రదర్శించారు. వినాయక ప్రార్థన జయం జయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఐశ్వర్య, యుక్తలు బాలార్క కోటి బాలా త్రిపురసుందరి కీర్తనకు, ధనలక్ష్మి హిరణ్మయీ లక్ష్మీ ముత్తుస్వామి దీక్షితుల కృతికి నృత్యాభినయం చేశారు. తదుపరి కృష్ణశబ్దం, ప్రహ్లాద చరితంపై రూపకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
టీటీడీ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సప్తగిరి మాసపత్రిక సీనియర్ ఉప సంపాదకురాలు డా. అల్లాడి సంధ్య, ధర్మప్రచార పరిషత్ సిబ్బంది కుసుమకుమారి, ధనలక్ష్మి, తిరుపతికి చెందిన సంగీత, నృత్యాభిమానులు, భక్తులు పాల్గొని నృత్య ప్రదర్శనను ఆస్వాదించారు.



No comments :
Write comments