తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవ సందర్భంగా శుక్రవారం రాత్రి తిరుమాడ వీధులు జాతీయ సాంస్కృతిక వైభవంతో అలరారాయి. దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన 31 కళాబృందాల 863 మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలు, జానపద కళలు, సంగీత వాద్య ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు.
భారీ వర్షంలోనూ అప్రతిహతంగా కళా ప్రదర్శనలు
మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కళాకారులు ఉత్సాహంగా ప్రదర్శనలు కొనసాగించారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, శాస్త్రీయ నృత్యరీతులు, జానపద కళారూపాలను ఆవిష్కరిస్తూ తిరుమాడ వీధుల్లో భక్తి సంబరాలను నింపారు.
భిన్న కళారూపాలతో భారతీయ సంస్కృతి పరిమళం
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డోగ్రీ నృత్యం, ఢిల్లీ, జార్ఖండ్‌లకు చెందిన వీరోచిత ఛౌ నృత్యం, అస్సాంకు చెందిన భక్తిరసభరిత సత్రియా నృత్యం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కథక్, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎమిరొల్లో నృత్యం, సిక్కింకు చెందిన తమంగ్ సేలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మహారాష్ట్ర లెజిమ్ నృత్యం, మధ్యప్రదేశ్ గిరిజన జానపద కళలు, రాజస్థాన్ ఘూమర్ నృత్యం, కర్ణాటక డొల్లుకుంట నృత్యం, కేరళ క్షీరసాగర మథనం నృత్యరూపకం, మోహినియాట్టం ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల జానపద కళలకు భక్తజన నీరాజనం
శ్రీకాకుళం కళాకారుల వీరోచిత తప్పెటగుళ్లు, భద్రాచలం ప్రాంతానికి చెందిన ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే కొమ్ముకోయ నృత్యం, విజయవాడ కళాకారుల చెక్క భజనలు భక్తులను అలరించాయి.
డోళ్ల మోతలు, గజ్జెల రవళులు, శంఖనాదాలు, భక్తిగీతాల నడుమ సాగిన ప్రదర్శనలు తిరుమాడ వీధుల్లో ఆధ్యాత్మిక శోభను మరింత ఇనుమడింపజేశాయి.
ఆధ్యాత్మిక వైభవానికి.. జాతీయ సమైక్యతకు ప్రతీక
శ్రీవారి గరుడోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో పాటు భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనానికి వేదికగా నిలిచింది. వివిధ రాష్ట్రాల కళాకారులు ఒకే వేదికపై తమ కళాప్రతిభను చాటడం ద్వారా ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని చాటారు.
భక్తి, సంస్కృతి, సంప్రదాయాలను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ జాతీయ సాంస్కృతిక వేడుక భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళా వైవిధ్యాన్ని ఆస్వాదించే అపూర్వ అవకాశాన్ని అందించింది.
No comments :
Write comments