22.10.26

ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం parveta utsavam







తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు నిర్వహించే సంప్రదాయ పార్వేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు నిర్వహించే ఈ ఉత్సవాన్ని, అధికమాసం కారణంగా నిర్వహించిన నవరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం కూడా నిర్వహించడం ఆనవాయితీ.

తిరుమలలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో, శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన పూర్తయిన అనంతరం శ్రీమలయప్పస్వామివారిని తిరుచ్చిపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారికి ఆరాధన, నివేదన, హారతి సమర్పించిన అనంతరం ఉభయదారులు, తాళ్లపాకవారు, మఠం వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం మర్యాదలు నిర్వహించారు.

దుష్టశిక్షణ – శిష్టరక్షణకు ప్రతీక

పార్వేట ఉత్సవంలో భాగంగా శ్రీమలయప్పస్వామివారి తరఫున అర్చకులు బాణం సంధించి కొంతదూరం ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చారు. ఈ ప్రక్రియను మూడుసార్లు నిర్వహించారు. దుష్టశక్తులను శిక్షించి, భక్తులను రక్షించడమే పార్వేట ఉత్సవంలోని అంతరార్థం.

అనంతరం శ్రీమలయప్పస్వామివారు పార్వేట మండపం నుంచి మహాద్వారానికి చేరుకుని, హతీరాంజీ మఠానికి చెందిన బెత్తాన్ని స్వీకరించి ఆలయ సన్నిధికి వేంచేయడంతో పార్వేట ఉత్సవం ముగిసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments