తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాదస్వర నాదాలు, వేదమంత్ర ఘోష, విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి సంగీతం, అన్నమయ్య సంకీర్తనలు, హరికథతో తిరుమల కొండ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.
నాదనీరాజనం వేదికపై నాదస్వర, వేద కార్యక్రమాలు
తిరుమల నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో శ్రీ కేశన్న, శ్రీ నాగేశ్వరరావు బృందం నాదస్వర ప్రదర్శన నిర్వహించింది. ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదసందేశం అందించారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
ఆస్థాన మండపంలో భక్తి సంగీతం.. ధార్మిక ఉపన్యాసం
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కృష్ణవేణి బృందం విష్ణు సహస్రనామ పారాయణం చేసింది. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీమతి అర్చన కులకర్ణి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తెనాలికి చెందిన శ్రీమాన్ రామానుజాచార్యులు ధార్మిక ఉపన్యాసం చేశారు.
అన్నమయ్య సంకీర్తనలు.. హరికథతో భక్తిరసామృతం
సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు విశాఖపట్నానికి చెందిన శ్రీ చైతన్య బ్రదర్స్ బృందం మధురమైన అన్నమయ్య సంకీర్తనలతో భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ పద్మనాభశర్మ బృందం హరికథా గానం ద్వారా భక్తి, ధర్మ సందేశాలను అందించింది.
ఈ కార్యక్రమాలను పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తిగా వీక్షించారు. వేదఘోష, హరినామ స్మరణ, భక్తి సంగీతంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియగా, భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల దివ్యానుభూతిని ఆస్వాదించారు.



No comments :
Write comments