టిటిడి
విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని, తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు సంస్థ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేయాలని టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర సూచించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన విద్యార్థి సంఘం (స్టూడెంట్స్ కౌన్సిల్) ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి ఈవో ప్రసంగించారు.
ఐదేళ్లు కష్టపడితే లక్ష్య సాధన సాధ్యం
ఇంటర్మీడియట్ రెండేళ్లతో పాటు ఆపై మూడేళ్లు కలిపి మొత్తం ఐదేళ్లపాటు కష్టపడి చదివితే విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఈవో తెలిపారు. కళాశాల స్థాయి నుంచే విద్యార్థినులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పోటీ పరీక్షల్లో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తాను అనుసరించిన విధానాలను తన అనుభవాలను విద్యార్థినులతో ఈవో పంచుకున్నారు. శ్రీవారి నిధులతో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
విద్య, వైద్య రంగాలకు మరింత ప్రాధాన్యం
టిటిడిలో విద్య, వైద్య రంగాల్లో మరింత సమర్థవంతంగా, నాణ్యమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
టిటిడి విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచి, ఉన్నత ప్రమాణాలతో విద్యా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల టాప్-10 కళాశాలల్లో స్థానం పొందే స్థాయికి ఎదిగిందని, అదే విధంగా టిటిడి ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థలు ఉన్నత ప్రమాణాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు.
శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో ప్రవేశం కోసం ప్రస్తుతం సుమారు 1:30 నిష్పత్తిలో పోటీ ఉందని పేర్కొన్న ఈవో, వచ్చే విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా అధ్యాపకులు, విద్యార్థినులు కృషి చేయాలని కోరారు.
వివిధ సబ్జెక్టుల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులను ఈ సందర్భంగా ఈవో సత్కరించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర అన్ని రంగాల్లోనూ విద్యార్థినులు రాణించాలని సూచించారు.
రూ.71 లక్షలతో నిర్మించిన ఈ-లెర్నింగ్ సెమినార్ హాల్ ప్రారంభం
శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో రూ.71 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ-లెర్నింగ్ సెమినార్ హాల్‌ను టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ప్రారంభించారు. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థినులకు ఈ సెమినార్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
అనంతరం విద్యార్థి సంఘాన్ని ప్రారంభించి, నూతనంగా ఎన్నికైన విద్యార్థి ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థి సంఘ ప్రతినిధులు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు.
అంతకుముందు కళాశాలలో నిర్వహిస్తున్న పాఠ్య, సహ పాఠ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను ప్రిన్సిపాల్ డా. సి. భువనేశ్వరిని అడిగి తెలుసుకుని పరిశీలించారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో శ్రీ ప్రభల గోపినాథ్, సీఈ శ్రీ మనోహరం, ఇన్‌చార్జి డీఈవో డా. ఏ.వి.ఎన్. శివకుమార్, ఎన్‌ఈ శ్రీ డి. నరసింహమూర్తిలను కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది సన్మానించి, శ్రీవారి జ్ఞాపికలను అందజేశారు.
విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, టిటిడి అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
No comments :
Write comments