డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాలు, వాహనసేవలు, పంచమితీర్థం ఏర్పాట్లపై శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, భద్రత తదితర అంశాల్లో ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
పంచమితీర్థానికిప్రత్యేకఏర్పాట్లు
పంచమితీర్థం రోజున లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఈవో సూచించారు. భక్తులు వేచి ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని, ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేలా తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
పుష్కరిణిలోకి భక్తులను విడతలవారీగా అనుమతిస్తూ, స్నానఘట్టాల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను క్రమబద్ధీకరించి, బారికేడ్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా తొక్కిసలాటకు అవకాశం లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని సూచించారు.
పడిఊరేగింపుమార్గాల్లోరహదారులమరమ్మతులు
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు వరకు పడి ఊరేగింపుగా వచ్చే మార్గాల్లో అవసరమైన రహదారి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆలయం లోపల, వెలుపల సుందరమైన పుష్పాలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఉద్యానవన విభాగం సహకారంతో, జేఈవో పర్యవేక్షణలో ఆలయ పరిసరాలను పుష్పశోభతో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ఆకర్షణీయమైన విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
వాహనసేవలను భక్తులందరూ వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. వాహనసేవల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబసమేతంగావిచ్చేసిఅమ్మవారికృపకుపాత్రులుకండి
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో విచ్చేసి, అమ్మవారి వాహనసేవలను తిలకించి, దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో కోరారు. భక్తులకు మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు టీటీడీ అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జేఈవోలు డాక్టర్ ఏ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments