4.9.26

TTD Addl EO Reviews Reception Department




In view of the annual Srivari Salakatla Brahmotsavams scheduled to be held from September 15 to 23, TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary held a review meeting on the arrangements by the Reception Department at the Sudharma Conference Hall in Tirumala, on Thursday.


During the meeting, he directed the officials to take necessary measures to ensure that devotees face no inconvenience in the allotment of accommodation during the ensuing Brahmotsavams. He instructed the officials concerned to complete any pending repairs in the rooms at the earliest.


He also directed the Reception Department to bring 60 per cent of the rooms in the mutts and Karnataka Choultries in Tirumala under its control during the Brahmotsavam days, so that accommodation could be provided to staff arriving on deputation for Brahmotsavam duties.


Tirumala Estate Officer Sri Venkateswarlu, In-charge IT GM Sri Venkateswarlu Naidu, Reception OSD Sri Satre Naik, AEO Sri Ashok and other officials participated.

బ్రహ్మోత్సవాల్లో వైద్య సేవల ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష review



సెప్టెంబర్ 15 నుండి 23 తేది వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వైద్య సేవలు, రవాణా విభాగాలు, పోలీసుల భద్రతపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి భక్తులకు అందుబాటులో ఉంచనున్న వైద్య సదుపాయాలను అదనపు ఈవోకు వివరించారు. 

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో అశ్వినీ ఆసుపత్రి, అపోలో కార్డియాక్ సెంటర్లు 24 గంటలు నిరంతరాయంగా పని చేస్తాయని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2, గాలి గోపురం, ఏటీసీ, కల్యాణకట్ఠ, పీఏసీ-5 ప్రాంతాల్లో 6 డిస్పెన్సరీలు, పీఏసీ-2, భాష్యకార్ల సన్నిధి, అలిపిరి రాజగోపురం, 1500 మెట్టు, ఏడో మైలు, శ్రీవారి మెట్టు 1200 మెట్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, శ్రీవారి ఆలయం, నారాయణగిరి షెడ్లు, దర్శన క్యూలైన్లలో ఒక మొబైల్ క్లీనిక్  (కృష్ణతేజ సర్కిల్ నుండి గోగర్భం సర్కిల్ వరకు) 10 ప్రథమ చికిత్సా కేంద్రాలతో పాటు రామ్ భగీచా,శిలాతోరణం, పాపవినాశనం, శ్రీవారి సేవా సదన్, శ్రీవారి మెట్టు, అలిపిరి పాదాల మండపం వద్ద నూతనంగా 6 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

అదేవిధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 11 మంది డాక్టర్లు, 139 మంది పారా మెడికల్ సిబ్బందికి అదనంగా 75 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం తిరుమలలో మొత్తం 16 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

మాడ వీధుల్లో భక్తులకు సమస్యలు తలెత్తితే పోలీసుల సమన్వయంతో సురక్షితంగా త్వరితగితిన ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మాడ వీధుల్లో అంబులెన్సు లకు క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తిరుమల డీఎస్పీ శ్రీ విజయ శేఖర్ ను కోరారు.

అంబులెన్స్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో క్రమశిక్షణతో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రవాణా విభాగం జీఎం శ్రీ రాము ను ఆదేశించారు.

ఈ సమావేశంలో వీజీఓ శ్రీ సురేంద్ర, అశ్వినీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నగరం ఆధ్యాత్మిక వైభవంతో ముస్తాబు కావాలి – టిటిడి జేఈవో డా. ఎ. శరత్ brahmotsavams


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి నగరం భక్తి, ఆధ్యాత్మికత, వైభవంతో వెలుగొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈవో డా. . శరత్ అధికారులను ఆదేశించారు. టిటిడి అధికారులతో కలిసి గురువారం రేణిగుంట విమానాశ్రయం నుండి గరుడ సర్కిల్ వరకు ఆయ పర్యటించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఈ నెల 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలిరానున్న నేపథ్యంలో, తిరుపతి నగరానికి అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి శ్రీవారి బ్రహ్మోత్సవాల దివ్య వైభవం ప్రస్ఫుటంగా కనిపించేలా నగర పరిసరాలను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి నగరానికి చేరుకునే మార్గంతో పాటు, నగరాన్ని నాలుగు వైపుల నుంచి కలిపే ప్రధాన కూడళ్లన్నీ శ్రీవారి భక్తి పరిమళాలు వెదజల్లేలా, ఆధ్యాత్మిక శోభతో అలరారేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

గత బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మరింత ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా విద్యుత్ అలంకరణలు, హోర్డింగులు, ఫ్లెక్సీలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రతిబింబించేలా అలంకరణల్లో భక్తి, సంప్రదాయం, సౌందర్యం ఉట్టిపడేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

తిరుపతి నగరానికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచే గరుడ విగ్రహాన్ని మరింత వైభవోపేతంగా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్ది, భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా చేయాలని సూచించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుపతి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా, తిరుమలలో జరిగే ప్రతి ఉత్సవ ఘట్టం తిరుపతి నగరంలోనూ భక్తులకు అనుభూతి కలిగించే విధంగా పండుగ వాతావరణం నెలకొల్పాలని ఆయన స్పష్టం చేశారు.

బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల హృదయాల్లో భక్తిభావాన్ని నింపేలా, తిరుపతి నగరమంతా శ్రీవారి నామస్మరణతో, వెలుగుల అలంకరణలతో, పుష్ప సోయగాలతో కళకళలాడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లు, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, విజీవో శ్రీ గిరిధర, ఈఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి తదితర అధికారులు పాల్గొన్నారు.

రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష ttd addl eo




నెల 15 నుండి 23 తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య ఆదేశించారు.

గురువారం తిరుమలలోని  సుధర్మ సమావేశ మందిరంలో రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గదులకు మరమ్మతులు ఏవైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.

బ్రహ్మోత్సవ విధులకు డిప్యూటేషన్ పై వచ్చే సిబ్బందికి వసతి కేటాయించేందుకు వీలుగా తిరుమలలోని మఠాలు, కర్ణాటక సత్రాల్లోని 60 శాతం గదులను బ్రహ్మోత్సవ రోజుల్లో టీటీడీ రిసెప్షన్ విభాగం నియంత్రణలోకి తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో తిరుమల ఎస్టేట్ అధికారి శ్రీ వేంకటేశ్వర్లు, ఇన్ ఛార్జ్ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, రిసెప్షన్ ఓఎస్డీ శ్రీ సత్రే నాయక్, ఏఈఓ శ్రీ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.