జూలై 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు sundararaja
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు ఈ నెల జూలై 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఊంజల్‌సేవ, వాహనసేవలు భక్తిశ్రద్ధల మధ్య జరుగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో మహా అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ఊంజల్‌సేవ జరుగుతుంది.
వాహనసేవల వివరాలు
జూలై 5 – పెద్దశేష వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి దివ్య విహారం.
జూలై 6 – హనుమంత వాహనంపై స్వామివారి మహోత్సవ విహారం.
జూలై 7 – గరుడవాహనంపై స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ప్రతి రోజు రాత్రి జరిగే ఈ వాహనసేవల్లో స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
అవతారోత్సవాల పురాణ విశిష్టత
శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలకు విశిష్టమైన చారిత్రక, పురాణ ప్రాశస్త్యం ఉంది. పూర్వకాలంలో మధురైలోని అళగిరి పెరుమాళ్ ఆలయంపై ముష్కరుల దాడుల నేపథ్యంలో అక్కడి అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను భద్రతార్థం తిరుచానూరుకు తీసుకువచ్చినట్లు ఆలయ సంప్రదాయం చెబుతోంది. అనంతరం మహంతుల కాలంలో మూలవిరాట్టును ప్రతిష్ఠించి నిత్యారాధనలు ప్రారంభించారు. ఈ పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది అవతారోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ ఉత్సవాల సందర్భంగా జూలై 5 నుండి 7వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊంజల్‌సేవను రద్దు చేశారు.
శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులను కోరుతోంది.




