3.9.26

సెప్టెంబరు 4న టీటీడీ ఆలయాల్లో వైభవంగా గోకులాష్టమి వేడుకలు సెప్టెంబరు 5న భక్తిశ్రద్ధలతో ఉట్లోత్సవం utlotsavam


శ్రీకృష్ణ జన్మోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ, వాహనసేవ, గోపూజ, ఆస్థానం

శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినమైన గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలోని పలు స్థానిక ఆలయాల్లో సెప్టెంబరు 4న భక్తిశ్రద్ధలతో వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 5న ఆయా ఆలయాల్లో ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, కపిలతీర్థం వద్దనున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ, వాహనసేవ, గోపూజ, గోకులాష్టమి ఆస్థానం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి.

తిరుచానూరు శ్రీ కృష్ణస్వామివారి ఆలయంలో...

గోకులాష్టమి రోజున ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలమూర్తులకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సవమూర్తులకు ముఖమండపంలో స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

సాయంత్రం 6.45 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

అనంతరం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.


సెప్టెంబరు 5న ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా జరుగుతాయి.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో...

సెప్టెంబరు 4న సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం, నివేదన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కపిలతీర్థం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో...

సెప్టెంబరు 4న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో...

సెప్టెంబరు 4న సాయంత్రం 5 నుంచి 6.40 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించి, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 5న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

భక్తి సంగీతంతో మారుమోగనున్న ఆలయాలు

గోకులాష్టమి, ఉట్లోత్సవాలను పురస్కరించుకుని ఈ రెండు రోజుల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

శ్రీకృష్ణుని దివ్య లీలలను స్మరిస్తూ, గోవింద నామస్మరణతో ఆలయాలు భక్తి పారవశ్యంతో మారుమోగనున్నాయి. ఈ పవిత్ర పర్వదినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

తిరుమలలో సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం, 5న ఉట్లోత్సవం utlotsavam




తిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని సెప్టెంబర్ 4 తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపుచేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.

సెప్టెంబర్ 5 తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటకు ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపైతిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు.

ఉత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5 శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

అదేవిధంగా సెప్టెంబర్ 4 గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో టిటిడి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం 10 నుండి 12 గంటల వరకు పంచాభిషేకాలు చేస్తారు. అనంతరం ఉట్లోత్సం నిర్వహిస్తారు.

2.9.26

భక్తుల ప్రశాంత దర్శనమే టీటీడీ ప్రధాన లక్ష్యం పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు – అధికారిక సమాచారాన్నే విశ్వసించాలి – టీటీడీ peaceful darshan


తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ నిరంతరం పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతోంది.

సర్వదర్శనం, నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వర్చువల్ సేవలు, ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలపై భక్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది.

రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు

ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పరిమితికి మించి పెరుగుతున్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో భారీగా తరలివచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోంది.

నిర్దేశిత సమయానికే దర్శనం కల్పించేలా సమన్వయం

స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నుంచి భక్తులకు కేటాయించిన సమయానికి శ్రీవారి దర్శనం కల్పించే వరకు అన్ని విభాగాలు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయి. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అధికారులు, ఉద్యోగులతోపాటు భద్రత, విజిలెన్స్, అన్నప్రసాదం, తాగునీటి విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు. నిర్దేశిత సర్వదర్శనంపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా టిటిడి నిర్ణయాలు చేపడుతోంది. 

దళారుల మోసాలపై కఠిన చర్యలు

శ్రీవారి దర్శనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని భక్తులను మోసం చేసే దళారులపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటోంది. దర్శనం, గదుల కేటాయింపు పేరుతో మోసాలకు పాల్పడిన దళారులపై ఈ సంవత్సరం ఇప్పటివరకు 30 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా, ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎవరైనా సరే – దళారులైనా, సిబ్బందైనా – రాజీలేని కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేస్తోంది.

నకిలీ వెబ్‌సైట్‌లపై చర్యలు

అదేవిధంగా, గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు, పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ (ఫేక్) వెబ్‌సైట్‌లను ఈ సంవత్సరం ఇప్పటివరకు టీటీడీ గుర్తించింది. వీటిపై 02 క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, సంబంధిత సంస్థల సహకారంతో ఆ వెబ్‌సైట్‌లన్నింటినీ తొలగించడం జరిగింది.

ఆన్‌లైన్‌లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లు, లింక్‌ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది.

నిషేధిత వస్తువులపై ప్రత్యేక నిఘా

తిరుమలకు వచ్చే భక్తులు వాహనాల్లో నిషేధిత వస్తువులను తరలించకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు తనిఖీ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. నిషేధిత వస్తువులు గుర్తించిన సందర్భంలో అలిపిరి టోల్‌గేట్ స్కానింగ్ కేంద్రం వద్దనే వాటిని సీజ్ చేస్తున్నారు. 

ఈ సంవత్సరం ఇప్పటివరకు అలిపిరి వద్దనే 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పవిత్ర తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యత దృష్ట్యా డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి రికార్డింగ్ పరికరాలు పూర్తిగా నిషేధమని, వీటిని తీసుకురావద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

అధికారిక సమాచారాన్నే విశ్వసించండి

శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్లు తదితర అంశాల్లో దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచిస్తోంది. 

భక్తులను అప్రమత్తం చేసేందుకు టీటీడీ సామాజిక మాధ్యమాలు, ఎస్‌వీబీసీ, ప్రజా సంబంధాల విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

టీటీడీ సూచనలు పాటించి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి

తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని టీటీడీ కోరుతోంది. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.