అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి బకాసుర వధ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ముత్యపు పందిరి వాహనంపై దివ్యంగా విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల నడుమ సాగిన వాహనసేవ భక్తులను పరవశింపజేసింది.
సాయంత్రం 5 గంటలకు స్వామివారిని ఊంజల్ మండపంలోకి వేంచేపు చేసి, 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ముత్యపు పందిరి వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు.
బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఈ వాహనసేవలో టిటిడి జేఈవో డా. ఎ. శరత్, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments