25.6.26

పద్మసరోవరంలో దివ్యంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు teppotsavams




తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29 తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.


జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే పవిత్ర తెప్పోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే భక్తుల కష్టాలు తొలగి, దైవానుగ్రహంతో సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


భక్తులను కాపాడే పద్మావతి అమ్మవారు


పద్మసరోవరంలోని బంగారు పద్మం నుండి అవతరించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను అన్ని కష్టాల నుండి కాపాడి, సుఖశాంతులు ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు తెలియజేస్తాయి. పద్మసరోవరంలో అమ్మవారి తెప్ప విహారం దర్శించుకోవడం భక్తులకు అపూర్వమైన దివ్యానుభూతిని కలిగిస్తుంది.


ఉత్సవాల విశేషాలు


జూన్ 25: రుక్మిణి, సత్యభామ సమే శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం – 3 ప్రదక్షిణలు


జూన్ 26: శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం – 3 ప్రదక్షిణలు


జూన్ 27 నుండి 29 వరకు: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం


జూన్ 27 – 3 ప్రదక్షిణలు

జూన్ 28 – 5 ప్రదక్షిణలు

జూన్ 29 – 7 ప్రదక్షిణలు


తిరుమంజనం


ఉత్సవాల చివరి మూడు రోజులైన జూన్ 27, 28, 29 తేదీలలో పద్మసరోవరంలోని నీరా మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు.


గజవాహన, గరుడవాహన సేవలు


జూన్ 28 తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29 తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సే వైభవోపేతంగా జరుగనున్నాయి. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించనున్నారు.


ఆర్జిత సేవలు రద్దు


తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను, అలాగే జూన్ 26 నిర్వహించే లక్ష్మీపూజ కూడా టిటిడి రద్దు చేసింది.


భక్తి సంగీతంసాంస్కృతిక వైభవం


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నారు.


భక్తులకు టీటీడీ విజ్ఞప్తి


శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య టాక్షం పొందేందుకు భక్తులు పెద్ సంఖ్యలో హాజరై వార్షిక తెప్పోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ కోరుతోంది.

No comments :
Write comments