నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు తిరుచ్చిపై కూర్మావతార అలంకారంలో గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.
గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా సాగిన వాహనసేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments