25.7.26

నందివిద్య నటేశ్వరి' కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ధర్మ, సంస్కార విలువల పెంపు – శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిnandini nateswari





టీటీడీ, హెచ్ డి పిపి, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 100 పాఠశాలల్లో విజయవంతమైన "ప్రజల వద్దకు ధర్మం" అనే దివ్య సంకల్పంతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువలు, సాంప్రదాయ కళల పట్ల అభిరుచిని పెంపొందించేందుకు 'నందివిద్య నటేశ్వరి' కార్యక్రమాన్ని రూపొందించినట్లు శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.

టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 100 పాఠశాలల్లో  నిర్వహించిన 'నందివిద్య నటేశ్వరి' కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో స్వామివారు వర్చువల్ ద్వారా అనుగ్రహ భాషణం చేశారు.

విద్యార్థుల్లో కళాభిరుచి, క్రమశిక్షణ, సంస్కార విలువలను పెంపొందించే లక్ష్యంతో మృదంగం, భారతీయ నృత్య కళల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 2025 డిసెంబరులో 50 పాఠశాలల్లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విశేష ఆదరణతో ఈ ఏడాది 100 పాఠశాలలకు విస్తరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు టీటీడీ విద్యాసంస్థలు పాల్గొనగా, తిరుపతి ప్రాంత పాఠశాలలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు.

'నందివిద్య నటేశ్వరి' అనే నామం శ్రీలలితా సహస్రనామంలోని 733, 734 నామాల నుండి ఆవిర్భవించిందని స్వామివారు వివరించారు.

జూలై 23న ఏకకాలంలో 100 వేదికలపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించి విజయవంతంగా ముగిసింది.

ధర్మప్రచారానికి టీటీడీ చేయూత

సనాతన ధర్మ ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో యువతలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి తగు ఆర్థిక సహాయంతో పాటు శ్రీవారి సుప్రభాతం, విష్ణు సహస్రనామం, గోవింద నామాలు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను పుస్తక ప్రసాదంగా ఉచితంగా అందజేశారు.

ప్రముఖ కళాకారులకు ఘన సన్మానం ఆకట్టుకున్న ఆధ్యాత్మిక కళాప్రదర్శనలు

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఏ. శరత్ చెన్నైకి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మవిభూషణ్ డా.  ఉమయాళ్‌పురం కె. శివరామన్, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీమతి రేవతి రామ్మోహన్లను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు అందించిన ప్రత్యేక కళాప్రదర్శనలు ప్రేక్షకులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి.

తదనంతరం తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ప్రదర్శించిన 'అష్టలక్ష్మి వైభవం' నృత్యరూపకం భక్తులను, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments :
Write comments