ఉదయం 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారు దివ్య రథాన్ని అధిష్ఠించి గ్రామ వీధుల్లో భక్తులకు అభయప్రదంగా దర్శనమిచ్చారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాల సంకీర్తనలు, కోలాటాల నృత్యాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. భక్తులు "గోవింద... గోవింద..." నామస్మరణలతో రథాన్ని లాగుతూ భక్తిశ్రద్ధలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. గ్రామ వీధుల్లో విహరించిన రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం ప్రబంధ పారాయణం, వేద శాత్తుమొర నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు.
రథోత్సవం ఆత్మజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఉత్సవం ద్వారా భక్తులకు తెలియజేస్తారు. శరీరానికి, ఆత్మకు మధ్య ఉన్న భేదాన్ని గ్రహించి ఆత్మానాత్మ వివేకాన్ని పెంపొందించుకోవడమే రథోత్సవం అంతరార్థం.
అనంతరం బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథ స్వామివారి అశ్వవాహన సేవ వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమర్‌నాథ రెడ్డి, ఈఈ శ్రీమతి సుమతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఏఈలు శ్రీ అమర్‌నాథరెడ్డి, శ్రీ దోరైరాజ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్‌తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జూలై 31నచక్రస్నానం
శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9.15 గంటల నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
No comments :
Write comments