19.7.26

తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం – శ్రీమాన్ దీవి రాఘవ దీక్షితులు vaikanasa bhagawat sastram





తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్యారాధనలు, ఉత్సవాలు శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారమే వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని తిరుమల శ్రీ వైఖానస దివ్యసిద్ధాంత వివర్ధిని అధ్యక్షులు శ్రీమాన్ దీవి రాఘవ దీక్షితులు తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వైఖానస దివ్యసిద్ధాంత వివర్ధిని , టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మరీచి మహర్షి తిరునక్షత్రోత్సవం ఘనంగా నిర్వహించారు.

వేదసంప్రదాయానికి వైఖానస ఆగమమే పునాది

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ దీవి రాఘవ దీక్షితులు మాట్లాడుతూ, వైఖానస భగవత్ శాస్త్రం వేదాధారితమైనదని, వేదమంత్రాలతో నిర్వహించే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమని చెప్పారు. శ్రీ మరీచి మహర్షి రచించిన విమానార్చనాకల్పం, ఆనంద సంహిత గ్రంథాల్లో ఆరాధన విధానాలను సమగ్రంగా వివరించారని తెలిపారు. నేడు తిరుమలలో నిర్వహిస్తున్న అష్టదళ పాదపద్మారాధన (స్వర్ణ పుష్పార్చన) కూడా మరీచి మహర్షి నిర్దేశించిన శాస్త్ర విధానంలో భాగమేనని పేర్కొన్నారు.

దేవాలయ సంస్కృతికి శ్రీ మరీచి హర్షి విశిష్ట సేవలు


ముఖ్య అతిథి, శ్రీ విఖనస ట్రస్ట్ కార్యదర్శి శ్రీమాన్ గంజాం ప్రభాకర ఆచార్యులు మాట్లాడుతూ, దేవాలయ నిర్మాణం, మండపాల నిర్మాణం, నిత్యారాధనలు, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన శాస్త్ర విధానాలను శ్రీ మరీచి మహర్షి సమగ్రంగా అందించారని తెలిపారు. దేవాలయాలు ధర్మపరమైన, సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్రబిందువులని చెప్పారు.

ఎస్‌వీ వేదిక్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు శ్రీ యశ్వంత్ దీక్షితులు మాట్లాడుతూ, తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం వైఖానస భగవత్ శాస్త్రంలో పేర్కొనబడిందని, ఈ ఉత్సవాలను దర్శించడం అశ్వమేధ యాగ ఫలాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వైఖానస పండితులు శ్రీ శేషసాయి మాట్లాడుతూ, వైఖానస కల్పసూత్రం మానవ జీవితాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దే మహోన్నత శాస్త్రమని చెప్పారు. శాస్త్రోక్తంగా నిర్వహించే దేవాలయ పూజలు లోకక్షేమానికి, దేశ సుభిక్షానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

పంచబేరాల ఆరాధనకు విమానార్చనాకల్పమే ఆధారం

తిరుమల శ్రీ విఖనస ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి శ్రీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, తిరుమలలో పంచబేరాల ఆరాధనకు శ్రీ మరీచి మహర్షి రచించిన విమానార్చనాకల్పం మూలగ్రంథమని తెలిపారు. ఈ ఆరాధన ద్వారా కోట్లాది మంది భక్తులపై శ్రీవారి అనుగ్రహం ప్రసరిస్తుందని, ధర్మబద్ధమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.

అనంతరం శ్రీమతి గంజాం కావ్యశ్రీ, చి. శ్రీలక్ష్మి ఆద్యలు ఆలపించిన వైఖానస వైభవ గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రీ ఎన్.వి.వి.ఎన్. దీక్షితులు వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, వైఖానస పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments :
Write comments