9.7.26

తాళ్లపాక శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ wall posters




అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి మరియు శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయాల్లో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూలై 24 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు రెండు ఆలయాల్లోనూ బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 24న అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని, జూలై 25 నుండి ఆగస్టు 2 వరకు స్వామి, అమ్మవార్లు ప్రతిరోజూ వివిధ దివ్య వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు.

అలాగే జూలై 30న సాయంత్రం 6 గంటలకు కల్యాణోత్సవం, ఆగస్టు 3న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, ఆర్చీలు, ఫ్లెక్సీలు తదితర ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ వాహనసేవల సందర్భంగా భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాలని సూచించారు.

అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి దివ్య కటాక్షానికి పాత్రులు కావాలని ఈవో ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎ. శరత్, సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments