జీర్ణోద్ధారణ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన మహాసంప్రోక్షణ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయానికి పూర్వ వైభవం, పవిత్రత మరింతగా చేకూరాలని ప్రార్థించారు.
మహాసంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం పునఃప్రారంభమైంది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్న టీటీడీ ఈవో
అంతకుముందు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈవోకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కోదండరామస్వామివారి ఆలయ విశిష్టత, చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ఈవోకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments