15.8.26

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి clealiness




వచ్చే నెల 15 తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో పారిశుద్ధ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.

శుక్రవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడంపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు. తిరుమల పవిత్రతకు, స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచేలా మరింత మెరుగైన పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన మెటీరియల్స్, ఆధునిక యంత్రాల వినియోగంపై కూడా చర్చించినట్లు వివరించారు.

రియల్‌టైమ్ ఫిర్యాదుల పరిష్కారానికినందకంయాప్‌

తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కొత్తగా ‘నందకం’ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ యాప్‌ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను రియల్‌టైమ్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని కూడా పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

తిరుమలలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే యాప్‌ ద్వారా గుర్తించి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి, సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.

తిరుమలతో పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి ఫుట్‌పాత్‌, ఇతర పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ‘మన ఊరు – మన గుడి’ వంటి సంస్థలు ముందుకు వచ్చి శుభ్రతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.

స్వచ్ఛంద సంస్థలు తిరుమలకే పరిమితం కాకుండా ఘాట్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పరిసర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇటీవల భక్తుల నుంచి తిరుమలలో స్వచ్ఛతపై మంచి అభిప్రాయాలు వస్తున్నాయని తెలిపారు.

తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు, సిబ్బంది మాత్రమే బాధ్యతగా భావించకుండా ప్రతి భక్తుడు కూడా తన బాధ్యతగా తీసుకోవాలని అదనపు ఈవో కోరారు.

భక్తులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల నుంచి చెత్తను బయటకు విసిరేయడం, ప్రయాణంలోనే ప్లాస్టిక్ తదితర వస్తువులను పడేయడం వంటి చర్యలు తరచుగా కనిపిస్తున్నాయని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు భక్తులు ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని చెప్పారు.

తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడి పవిత్రత, స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వారికి భక్తులు కూడా సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments