30.8.26

ప్రకృతి నియమాలకు అనుగుణమైన జీవనశైలితోనే సంపూర్ణ ఆరోగ్యం – ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజు nature and healthy






ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సమయపాలన లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు డా. మంతెన సత్యనారాయణ రాజు న్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయుష్‌ శాఖ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో “యోగ, ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణ” అంశంపై రెండు రోజుల అవగాహన కార్యక్రమం శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది.


ఈ కార్యక్రమంలో తొలి రోజు టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులకు, రెండో రోజు టీటీడీ ఉద్యోగులు, పురప్రజలకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, డిజిటల్‌ సమతుల్యత, ఆహారమే ఔషధం, డిజిటల్‌ డిటాక్స్‌ తదితర అంశాలపై డా. మంతెన సత్యనారాయణ రాజు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.


సాయంత్రం ఆరు గంటలలోపే రాత్రి భోజనం


“ఆరోగ్య సంజీవిని” అంశంపై డా. మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, జీవన విధానం ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. సూర్యోదయం, సూర్యాస్తమయాలను అనుసరించి దైనందిన కార్యక్రమాలను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రాత్రి భోజనాన్ని సాయంత్రం ఆరు గంటలలోపే పూర్తి చేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు.


రాత్రి ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుందని తెలిపారు. సాయంత్రం వేళ అవసరాన్ని బట్టి డ్రైఫ్రూట్స్‌, విత్తనాలు, పండ్లు వంటి సహజ ఆహారాన్ని తీసుకోవచ్చని సూచించారు.


ఆహారంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం


ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ విధానాన్ని పాటిస్తున్నారని తెలిపారు. ఆహారం తీసుకునే సమయం, పరిమాణంపై నియంత్రణ ఉండాలని సూచించారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించారు.


ఏకభుక్తం, లంఖణంపరమౌషధం


దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఇంద్రియ నిగ్రహం, యోగం, ధ్యానం, నియమబద్ధమైన జీవన విధానం ద్వారా ఆరోగ్య సూత్రాలను ఆచరించారని డా. మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.


ఏకభుక్తం, లంఖణంపరమౌషధంఅనే భావనను వివరిస్తూ, శరీర 


అవసరాలను అర్థం చేసుకుని ఆహారం తీసుకోవాలని సూచించారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్తకణాలు వ్యాధులతో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.


చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు


చిన్న వయస్సు నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవన విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు.


సమయపాలన, సహజమైన ఆహారం, యోగం, ప్రకృతికి అనుగుణమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీ వెంకటేశ్వర్‌, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీ జయకృష్ణ, ఆయుష్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డా. నాగముని నాయక్‌, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్‌, విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments