18.8.26

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ valmikipuram




వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు సోమవారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆగస్టు 18న ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 19న ఉదయం యాగశాల పూజ, 6.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గృహస్తులు (ఇద్దరు)  రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేక ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు ఇతర అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

No comments :
Write comments