శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 76వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా “శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి యోగమార్గం” అనే అంశంపై డాక్టర్ రాజశేఖర్ ప్రసంగించారు.
యోగాన్ని కేవలం శారీరక సాధనగా కాకుండా మనస్సుకు ప్రశాంతతను, ఆలోచనలకు ఉన్నతిని, జీవితానికి ఆధ్యాత్మిక దిశను చూపే సాధనగా ప్రభాకరశాస్త్రిగారు భావించారని తెలిపారు. ఆయన యోగమార్గంలో ఆత్మశుద్ధి, సాత్విక జీవనం, ఆధ్యాత్మిక చింతనతోపాటు మానవ సేవకు విశిష్ట స్థానం ఉండేదన్నారు.
యోగసాధన ద్వారా ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, సమాజానికి ఉపయోగపడే ఉత్తమ జీవన విధానాన్ని అలవరచుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభాకరశాస్త్రిగారి యోగసాధన, ఆధ్యాత్మిక జీవన విధానం నేటి తరానికి కూడా జ్ఞానదీపంలా మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.
ప్రాచీనతెలుగుసాహిత్యపరిరక్షణలోవిశిష్టకృషి
చంద్రగిరికి చెందిన డాక్టర్ సంగీతం కేశవులు “ప్రాచీన తెలుగు సాహిత్యానికి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చేసిన కృషి” అనే అంశంపై ప్రసంగించారు.
తెలుగు సాహిత్య చరిత్రలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రాచీన గ్రంథాలు, తాళపత్ర రచనలు, అరుదైన సాహిత్య సంపదను వెలికితీసి, పరిశోధించి, భావితరాలకు అందించడంలో ఆయన చేసిన కృషి అపూర్వమన్నారు.
ప్రాచీన తెలుగు సాహిత్యంలోని చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య వైభవాన్ని వెలుగులోకి తీసుకురావడంలో శాస్త్రిగారి పరిశోధనలు ఎంతో కీలకమని చెప్పారు. ఆయన పరిశోధన, సంపాదకత్వం ద్వారా అనేక అరుదైన రచనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిరక్షించి భావితరాలకు అందించేందుకు ఆయన జీవితం, సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.
వేటూరివిగ్రహానికిఘననివాళి
ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఉన్న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహానికి టీటీడీ హిందూ ధర్మ ప్రచార కార్యదర్శి డా. మేడసాని మోహన్, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీమతి లత, ఇతర అధికారులు, సాహితీవేత్తలు, పురప్రజలు పాల్గొన్నారు.
No comments :
Write comments