22.9.26

సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్య వైభవం surya prabha









తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్యదర్శనం అనుగ్రహించారు.


సూర్యకాంతుల మధ్య స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తుండగా, భక్తులు భక్తిపారవశ్యంతో “గోవిందా.. గోవిందా” అంటూ నామస్మరణ చేశారు. వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.


ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్యప్రభ వాహనం


సూర్యుడు సకల జీవులకు ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ప్రసాదించే దివ్యశక్తికి ప్రతీక. ప్రకృతికి చైతన్యప్రదాతగా, సకల రోగ నివారకుడిగా సూర్యుడిని సూర్యనారాయణుడిగా భక్తులు ఆరాధిస్తారు. సూర్యమండల మధ్యవర్తిగా శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నారనే ఆధ్యాత్మిక విశ్వాసానికి సూర్యప్రభ వాహనసేవ ప్రతీకగా నిలుస్తుంది.


సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపద కలుగుతాయని భక్తుల విశ్వాసం.


రాత్రి చంద్రప్రభ వాహనసేవ


సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం అనుగ్రహించనున్నారు.


సెప్టెంబరు 22న వైభవంగా రథోత్సవం


శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు రథోత్సవం వైభవంగా జరుగనుంది.


వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments