16.10.26

హరితశోభితంగా తిరుమల.. వన్యప్రాణులకు సురక్షిత నిలయం green tirumala




తిరుమలను మరింత హరితశోభితంగా తీర్చిదిద్దడంతో పాటు, శేషాచల అటవీ ప్రాంతంలోని ప్రకృతి సంపదను, వన్యప్రాణులను సంరక్షించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని టీటీడీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌వో) దొరస్వామి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2 మీడియా సెంటర్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపు, వన్యప్రాణుల పర్యవేక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.


తిరుమలలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రాధాన్యం


టీటీడీ పరిధిలోని తిరుమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, శ్రీగంధం వంటి విలువైన వృక్షాలతో పాటు వివిధ ఔషధ మొక్కలను పెంచుతున్నట్లు ఎఫ్‌ఆర్‌వో తెలిపారు. పార్వేట మండపం వద్ద నక్షత్ర వనాలను అభివృద్ధి చేయడంతో పాటు రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు.


వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, జీఎన్‌సీ టోల్‌గేట్‌, అలిపిరి తదితర ప్రాంతాల్లో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలో సువాసనలు వెదజల్లే మొక్కలు, రంగురంగుల పూల మొక్కలను పెంచి ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నట్లు తెలిపారు.


చిరుతల కదలికలపై 24 గంటల నిఘా


తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు దొరస్వామి తెలిపారు. ముఖ్యంగా చిరుతల కదలికలను గుర్తించేందుకు అటవీ సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.


సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాలతో పాటు డ్రోన్ల సహాయంతో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రిమోట్ మోమోను కూడా త్వరలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.


శేషాచల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ నిషేధం


శేషాచల అటవీ ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని కాపాడటం, వన్యప్రాణుల సంరక్షణకు భంగం కలగకుండా చూడటం లక్ష్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించినట్లు ఎఫ్‌ఆర్‌వో స్పష్టం చేశారు. భక్తులు ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లవద్దని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


వన్యప్రాణులకు ఆహారం పెట్టవద్దు


ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులు వన్యప్రాణులకు ఆహారం అందించడం వల్ల వాటి సహజ ఆహారపు అలవాట్లు మారి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని దొరస్వామి తెలిపారు. సహజంగా ఆహారాన్ని సమకూర్చుకునే అలవాట్లు తగ్గడం వల్ల వన్యప్రాణుల జీవన విధానంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.


కావున భక్తులు ఘాట్ రోడ్లపై కోతులు సహా ఇతర వన్యప్రాణులకు ఆహారం పెట్టకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీ ప్రాంతాల్లో పడవేయకుండా, ప్రకృతి సంపదను కాపాడుతూ తిరుమల పవిత్రతను, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.


ప్రకృతి పరిరక్షణలో భక్తుల సహకారం కీలకం


తిరుమల పచ్చదనాన్ని పెంపొందించడం, శేషాచల అటవీ ప్రాంత జీవవైవిధ్యాన్ని కాపాడటం, వన్యప్రాణులకు సురక్షిత ఆవాసాన్ని అందించడం టీటీడీ అటవీ విభాగం ప్రధాన లక్ష్యాలని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు. భక్తులు అటవీ సంరక్షణ నిబంధనలను పాటిస్తూ టీటీడీ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ మీడియా సమావేశంలో టీటీడీ పీఆర్వో (ఎఫ్‌ఏసీ) కుమారి నీలిమ, డీఆర్‌వో శ్రీ మధుసూదన్ పాల్గొన్నారు.

No comments :
Write comments