చంద్రగిరి
శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో జూలై 10వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవం గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.గురువారం ఆలయ ప్రాంగణంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, దీపపూజలో పాల్గొనే వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణకు అదనపు సిబ్బంది తదితర సౌకర్యాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
అలాగే టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, సుందర పుష్పాలంకరణలతో దివ్యంగా అలంకరించాలని, భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను మరింతగా పెంపొందించేలా పవిత్ర వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు.
ఈ మహోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజీవో శ్రీ గిరిధర్, డీఈ శ్రీమతి సరస్వతి, పలు శాఖల అధికారులు, ఎస్వీబీసీ అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments