24.7.26

14 గంటల్లో ఆంజనేయ స్వామి విగ్రహం స్వాధీనం శాస్త్రోక్తంగా పునః ప్రతిష్ఠించిన టీటీడీ anjaneya





తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటనలో టీటీడీ విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టి, 14 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో పాటు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.


టీటీడీ ఆగమ సంప్రదాయాల ప్రకారం పుణ్యహా వచనం, జల సంప్రోక్షణం తదితర శాస్త్రోక్త క్రతువులు నిర్వహించి, గురువారం ఉదయం 8.30 నుంచి 9.00 గంటల మధ్య అదే ప్రదేశంలో విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించినట్లు ఆయన వెల్లడించారు.


ఘటనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల నిఘా, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తత, జిల్లా పోలీసులతో సమన్వయం కారణంగా అత్యంత తక్కువ సమయంలో నిందితుడిని గుర్తించి విగ్రహాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమైందని అదనపు ఈవో పేర్కొన్నారు.


భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఘాట్ రోడ్డులోని చిన్న దేవాలయాలు, విగ్రహాలకు రక్షణగా గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మరింత నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


తిరుమల ఘాట్ రోడ్లలో దశాబ్దాలుగా భక్తులు ప్రతిష్ఠించిన అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయని, వాటి పవిత్రతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.


ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే భక్తులు టీటీడీ టోల్‌ఫ్రీ నంబర్ లేదా విజిలెన్స్ అధికారులకు తెలియజేయాలని కోరారు.


టీటీడీ వద్ద అత్యాధునిక నిఘా వ్యవస్థ అందుబాటులో ఉందని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి, బాధ్యులను గుర్తించే సమర్థమైన వ్యవస్థ పనిచేస్తోందని అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలియజేశారు.


పూజా కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments